ప్రయత్నించి ఓడిపోతే బాధపడను: జెఫ్ బెజోస్
దిల్లీ: ప్రపంచంలో ధనవంతుడైన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్ అభివృద్ధికి ఎంతో అవకాశమున్న ప్రధానమైన మార్కెట్ అని, 21వ శతాబ్దం భారత్‌దేనని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారత్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేసేందుకు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు జెఫ్ బెజోస్ ప్రకటించారు. వైఫల్యాల నుంచి నేర్చుకొనేందుకు ‘అమెజాన్’ ఓ మంచి ప్రదేశమని చెప్పారు. బుధవారం జరిగిన చిన్న, మధ్యతరహా ఆన్‌లైన్ వ్యాపారులతో నిర్వహించిన ‘అమెజాన్ సంభవ్’ సదస్సులో అమెజాన్ ఇండియా చీఫ్ అమిత్ అగర్వాల్‌తో జరిగిన ఇష్టాగోష్ఠిలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘ప్రయోగాల ద్వారా వచ్చే వైఫల్యాలు కొన్నిసార్లు సరికొత్త ఆవిష్కరణలకు కారణమవుతాయి. ప్రతిభాపరంగా ఉండే వైఫల్యాలను మాత్రం నివారించుకోవాలి. ఓటమిని, వైఫల్యాలను ఎవరూ ఇష్టపడరు. ఓటమి అనేది తెలిసినప్పుడు అది చాలా చిరాకుగా ఉంటుంది. బాగా అనిపించదు. ఒక విజయం వెనుక, ఒక విజేత వెనుక డజన్ల కొద్దీ వైఫల్యాలు ఉంటాయి’’ అని చెప్పారు.
భారత పర్యటనకు విచ్చేసిన బెజోస్ చిన్నారులతో కలిసి పతంగులు వేసిన అనుభవం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. చిన్నప్పుడు తన తాతయ్య గారింట్లో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘‘తాతయ్య నుంచి చాలా నేర్చుకున్నా. గ్రామీణ ప్రాంతాలు వనరులతో కూడినవి.. అక్కడ నివసించే ప్రజలు ఎంతో స్వయం సమృద్ధి, స్వావలంబనతో ఉంటారని నేను నమ్ముతా. అది నాపై ఓ బలమైన ముద్ర వేసింది’’ అన్నారు.
1994దాకా ఓ స్థిరమైన ఉద్యోగంలో ఉన్న తనకు ఆన్‌లైన్‌లో పుస్తకాలు విక్రయించాలనే ఆలోచన వచ్చినప్పటి విశేషాలను వివరిస్తూ.. ‘‘నేను నా బాస్ డేవిస్ వద్దకు వెళ్లాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇంటర్నెట్‌లో పుస్తకాలు విక్రయించాలనే నా ఆలోచనను ఆయనకు వివరించాను. ఆయన నన్ను న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్కులో వాకింగ్‌కు తీసుకెళ్లారు. ఇది నాకు మంచి ఆలోచనగానే అనిపిస్తోంది. కానీ ఇప్పటికే మంచి ఉద్యోగం లేనివారికైతే ఈ ఆలోచన బాగుండేది అన్నారు’’ అని బెజోస్ చెప్పుకొచ్చారు.
ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు తనలో కలిగిన అంతర్మథనాన్ని వివరిస్తూ.. ‘‘నాకు 80 ఏళ్లు వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భంలో నన్ను నేను వెనక్కి తిరిగి చూసుకుంటే.. కంపెనీలో ఉద్యోగాన్ని, ఏడాదిలో వచ్చే బోనస్‌ను వదిలి వెళ్లినందుకు నేను బాధపడతానా? ఇది గొప్ప ఆలోచన అని నాకు తెలుసు. ఇది నేను ప్రయత్నించకపోతే ఎప్పుడూ ప్రయత్నించలేదని బాధపడతాను. ప్రయత్నించి ఓడిపోతే నేను ఎప్పుడూ బాధపడను’’ అని అనుకున్నానన్నారు.
ఆ ఆలోచనతో బెజోస్ సీటెల్‌లో ప్రారంభించిన ప్రయాణం.. దాదాపు 7లక్షల మంది ఉద్యోగులు కలిగిన గొప్ప బలమైన అమెజాన్ సంస్థగా ఎదిగింది. మీరు అనుకున్నది సాధించి ఉండకపోతే ఏం చేసేవారని బెజోస్‌ను ప్రశ్నించగా.. ఎక్కడో సంతోషంగా ఉండే సాఫ్ట్‌వేర్ ప్రొగ్రామర్ అయ్యుండేవాడిని’ అంటూ బదులిచ్చారు.
No comments:
Post a Comment