Nakkerla
కారణమేంటో తెలుసా? బీజేపీ తీవ్ర విమర్శలు..
ప్రపంచంలోనే అతిపెద్ద ఈకామర్స్ సంస్థను నడుపుతోన్న జెఫ్ బెజోస్ కు ఈ సారి భారత పర్యటన చేదు అనుభవాల్ని మిగిల్చంది. పర్యటన తొలిరోజే ఇండియాలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించిన ఆయనకు పొగడ్తలకు బదులు వెక్కిరింతలు ఎదురయ్యాయి. బహిరంగ వేదికపై నుంచే కేంద్ర కామర్స్ మంత్రి పియూష్ గోయల్.. బెజోస్ పై సెటైర్లు వేశారు. అమెజాన్ లాంటి సంస్థలు ఇండియా లాంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టేది లాభాలకోసమేగానీ, దాన్నొక సేవా కార్యక్రమంలా ప్రచారం చేసుకోవడం తగదని గోయల్ వ్యాఖ్యానించారు.
ముఖంచాటేసిన మోదీ..
కార్పొరేట్ ప్రపంచానికి ఇష్టుడిగా పేరుపొందిన ప్రధాని నరేంద్రమోదీ.. ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న అమెజాన్ అధిపతికి మాత్రం షాకివ్వడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బెజోస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి మోదీ నిరాకరించారన్న వార్త అమెరికాలోనూ హెడ్ లైన్స్ లో వచ్చింది. దీనివెనకున్న కారణాల్ని పరిశీలిస్తే..
చిచ్చురేపిన ‘పోస్టు' కథనాలు
కాగా, అమెజాన్ సీఈవోపై ప్రధాని మోదీ గుర్రుగా ఉండటానికి గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో ప్రధానశ్రేణి మీడియా సంస్థల్లో ఒకటైన ‘వాషింగ్టన్ పోస్ట్' పత్రిక గత కొంత కాలంగా యాంటీ మోడీ వాయిస్ వినిపిస్తోంది. గతేడాది మోదీ అమెరికాలో పర్యటించి, ట్రంప్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంలోనూ పలు విమర్శనాత్మక కథనాలు రాసింది. ‘వాషింగ్టన్ పోస్ట్' పత్రికను కొన్నేళ్లకిందటే జెఫ్ బెజోస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బెజోస్ ఆదేశాల మేరకే యాటీ మోడీ వార్తలు రాశారని, ఆ కారణం వల్లే అమెజాన్ అధినేతకు మోదీ అపాయింట్ మెంట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
అమెజాన్ పై బీజేపీ తీవ్రవిమర్శలు
కేంద్ర మంత్రితో చివాట్లు, ప్రధాని మోదీ ఆఫీసులో పరాభవం ఎదుర్కొన్న అమెజాన్ సంస్థను, దాని అధినేత జెఫ్ బెజోస్ ను బీజేపీ శ్రేణులూ వదిలిపెట్టడంలేదు. బీజేపీ విదేశీ వ్యవహారాల ఇన్ చార్జి విజయ్ చౌతాయివాలె నేరుగా బెజోస్ ను టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. 10 లక్షల ఉద్యోగాలు కల్పించడం కంటే ముందు బెజోస్ ఇండియా పట్ల తన వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలని, ఇక్కడికొచ్చి నీతులు వల్లించేబదులు వాషింగ్టన్ లోని తన పత్రిక(వాషింగ్టన్ పోస్టు) ఉద్యోగులకు మంచి మాటలు చెప్పాలని చౌతాయివాలె విమర్శించారు.
స్ట్రాంగ్ వార్నింగ్..?
ఇండియాలో వ్యాపారవాణిజ్యాలు చేయాలనుకునే విదేశీ సంస్థలు ఇక్కడి చట్టాలు, నిబంధనల్ని విధిగా గౌరవించాల్సిఉంటుందని, లేకపోతే ఎంత గొప్పవాళ్లైనా, ఎంత గొప్ప సంస్థలనైనా పక్కనపెడతామన్న సంకేతం ఇవ్వడానికే అమెజాన్ సీఈవో పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తున్నదని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు.. జెఫ్ బెజోస్ ఫొటోకు ఇంకుపూసి నిరసనలు తెలిపారు
No comments:
Post a Comment